Thursday, September 26, 2019

Srimannarayana Satakamu

 

 

శ్రీమన్నారాయణ శతకము

(శ్రీకృష్ణావతార సంగ్రహము)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రణీతము

పోచిరాజు కామేశ్వర రావు

 

శ్రీమన్నారాయణ శతకము

(శ్రీకృష్ణావతార సంగ్రహము)

 

 

 

కం.

శ్రీన్నవ్యానందద విల

సన్నానా లోక గర్భ! సాగర కన్యం

జెన్నున్నిల్పి తెడఁద శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

1.      

 

 

 

కం.

అన్నుల మిన్నకు దేవకి

కన్నర వసుదేవునకు వరాంగభఁవుఁడవై

కన్నా పుట్టితి విల శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

2.     

 

 

 

కం.

విన్నేలఁ జెప్ప నకటా

తన్ను వధింతు వని నీవు ధరఁ గంసున కా

పన్నునిఁ జేయుట కన శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

3.     

 

 

 

కం.

కన్న మఱు క్షణం బిచ్చితి

పన్నుగ నిజ దర్శనంబు పంకజ నాభా

వెన్నుని విశ్వాకృతి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

4.     

 

 

 

కం.

మున్నిడి దేవకి కుక్షి గు

రున్నిల్పితి వాదిశేషు రోహిణి కుక్షిం

గన్నా కార్య మెఱిఁగి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

5.     

 

 

 

కం.

నిన్నుంచఁ బంచి మందను

గన్నియ నా యోగమాయఁ గారను బెట్టం

బన్నక మొనరించితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

6.     

 

 

 

కం.

అన్నా కనుమా కూతురు

చన్నే పుత్రుండు కాఁడు చంపఁగ ననినం

దన్నొల్లం డకటా శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

7.     

 

 

 

కం.

నన్నుం జంపఁ దరమ్మే

నిన్నుం జంపెడి బుడుతఁడు నెగడెడు నంచున్

విన్నందెం గన్యక శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

8.     

 

 

 

కం.

చన్నీయ వచ్చి పూతన

నిన్నెత్తు కొనంగ నవ్వి నెలఁత యసువులం

గన్నా వే కొంటివి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

9.     

 

 

 

కం.

నన్నే కనె నని యొక్కతి

నన్న యరసి నవ్వె నంచనఁగ నొక్కతి య

న్నన్నా యంద ఱటులె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

10.   

 

 

 

కం.

ఉన్నన్ బరువుగ దించఁగ

నిన్నుం గొని పోవ దైత్యుని తృణావర్తుం

గ్రన్నన వధియించితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

11.    

 

 

 

కం.

నిన్నుంచ బండి చెంతం

గన్నా యుండు మని చన శకట దైత్యుండే

తన్నంగ నీ వవిసె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

12.   

 

 

 

కం.

నిన్నుం గట్టిన ఱోటన్

మన్నింపఁగ నీడ్చితయ్య  మద్దుల జతపై

సన్నిధిఁ గన  యక్షుల శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

13.   

 

 

 

కం.

మన్నేలఁ దింటి వనఁగా

నన్నోటను జూపి తంత నభ వాండంబే

చెన్నుగ నిజ జననికి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

14.   

 

 

 

కం.

నిన్నున్ మ్రింగఁగ వచ్చిన

పెన్నసు రాధమునిఁ గొంగ విడఁదీసి నసం

గ్రన్ననఁ జీల్చితి వట శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

15.   

 

 

 

కం.

కన్నుల  విన్కలిఁ జంపితి

నిన్నుం గబలింప రాఁ గని యఘాసురునిన్

మిన్నఁగఁ బెంచి మెయిని శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

16.   

 

 

 

కం.

నిన్నణఁప నెంచు బల సం

పన్నునిఁ బెన్దూడ రూపి వత్సాసురునిన్

మున్నారసి త్రుంచితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

17.   

 

 

 

కం.

కన్నా నామ కరణములె

యన్నకు నీకు వసుదేవుఁ డన గర్గుండే

పన్నెను గుప్తమ్ముగ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

18.   

 

 

 

కం.

వన్నెల్ చిన్నెల గోపిక

లెన్నిరి చిత్తమున నిన్న కృష్ణా యనుచున్

సన్నిహితు లైరి తమి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

19.   

 

 

 

కం.

కన్నులు మూయరు నిశలో

నిన్నే స్మరియింపక మదినిం దెఱవ రహో 

కన్నుల నుదయమ్మున శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

20.  

 

 

 

కం.

ఎన్నఁగఁ గాంతలె వారలు

వెన్నుఁడ యలరింప దిగిరి వివరింపంగా

మున్నెల్లరు మునులే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

21.   

 

 

 

కం.

జన్నపు టన్నము గొను నో

కన్నా గోపాల బాలక గణముతోఁ  

ద్దన్నము తింటివయా శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

22.  

 

 

 

తే.గీ.

అన్నలువ గొల్ల పిన్నల

నిన్నరయఁగ దాఁపఁ బశుల నీ వయితి వయా

పన్నుగ నన్నియు నట శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

23.  

 

 

 

తే.గీ.

తన్న ఖ రాకారమ్మున

నన్న యొడిసి ధేను కాఖ్యు నంఘ్రులు నాల్గున్

మన్నుం దినిపించెన్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

24.  

 

 

 

కం.

చెన్నఱ చేతఁ బడగపై

మిన్నఁగఁ గాళీయుఁ జఱచి మించితి వింతం

బన్నగ ఫణ నటనన్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

25.  

 

 

 

కం.

మిన్నంటు దవాగ్ని శిఖలఁ

గన్నన్ గో గోప గోపిక లదరి వేఁడం

గ్రన్నన మింగి తడరి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

26.  

 

 

 

కం.

పన్నుగడఁ బ్రలం బాసురుఁ

డన్నను మోయ వధ నెంచి యబ్బల రాముం

డన్నర రూపు నడిచె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

27.  

 

 

 

కం.

పున్నమి చంద్రుఁడు గురియన్

వెన్నెల నీ వూఁద మురళి బృందావనిలోఁ

గన్నియ లెరిసిరి కన శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

28.  

 

 

 

కం.

కన్నా నీ గానము వినఁ

జన్నుల్ గుడువంగ మాని సాచుచు మోరల్

నిన్నే కను లేఁగలు శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

29.  

 

 

 

కం.

మున్నెమరుల్ మేఁతలు కడు

సన్నగిలన్ గో గణంబు సాచుచు మోముల్

వెన్నంట నిల్చినది శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

30.  

 

 

 

కం.

అన్నల్లని మెయి మబ్బని

యన్నాదము లుఱుము లంచు నాడెను నెమళుల్

కన్నా నిన్నే కని శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

31.   

 

 

 

కం.

పన్నుగఁ గొమ్మలఁ బక్షులు

త్వన్నాదం బాల కించి తమ కన్నుల యం

దున్నిన్నిడె మును లన శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

32.  

 

 

 

కం.

సున్నయిన రాగపుఁ దెలివి

త్వన్నద మాలించి లేళ్ళు తల లెత్తి తమిన్

నిన్న కదియు చుండెను శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

33.  

 

 

 

కం.

విన్నన్నాద మల లుఱుక

నన్ననల నొసంగుచుఁ గలహంస పలుకులన్

నిన్నలరించు నదులు శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

34.  

 

 

 

కం.

విన్నున మెయిళులు విరులం

ద్వన్నినదమ్ము విని కురిసి పట్టెను గొడుగున్

నిన్నరసి సితమ్మును శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

35.  

 

 

 

కం.

నిన్నంటి కేలఁ జెంచిత

లన్నిగ నిగ లాడు పండ్ల నందించి కడుం

జెన్నుగ మురిసి రయా శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

36.  

 

 

 

కం.

విన్నన్ గానము వే కరఁ

గె న్నగ సంచయము తేలగిలిరి నర సురుల్

పన్నుగ విరిసెఁ దరులు శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

37.  

 

 

 

కం.

అన్నీట డిగ్గ వివసన

మన్నారులు వాస నాపహరణమ్మున న

న్నన్న వ్రత ఫల మిడితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

38.  

 

 

 

కం.

అన్నలు మగలున్ బిడ్డలు

చన్నే యన్న మునిసతులు సాదము తోడన్

నిన్నుం గొలిచి రయా శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

39.  

 

 

 

కం.

మున్నేల యెఱుఁగ కుంటిమి

వెన్నుని లీల లని మునులు వెలఁదుల కన్నన్

సన్న మని తపించిరి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

40.  

 

 

 

కం.

మిన్నయ నగమ్ము శక్రుని

కన్న నని నగంపుఁ బూజ కమనీయముగాఁ

గన్నా చేయించితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

41.   

 

 

 

కం.

అన్న శిలా వృష్టిన్ ది

క్కన్నన్ గోవర్ధనగిరి నందఱి వే కా

వ న్నగము నెత్తితే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

42.  

 

 

 

కం.

ఖిన్నత నీ కేడు దినము

ల న్నగ ముండంగఁ గేల నవ్వానల నా

పె న్నగ రిపుం డదరి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

43.  

 

 

 

కం.

అన్నందుఁ గొని చనఁగ వరు

ణన్న భటులు వరుణలోక మల్లోకం బ

న్నన్న యరిగి తెచ్చితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

44.  

 

 

 

కం.

నిన్నుం జేరిన గోపిక

లన్నుల మిన్నల రమించి యంతర్దానం

బన్నా కా నెరిసిరి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

45.  

 

 

 

కం.

క్రన్నన విస మ్మనలముం

బన్నగ మా ఱాలవానఁ బాలించియు నీ

వన్ననవింటి కిడుదె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

46.  

 

 

 

కం.

అన్నుల మిన్నలఁ బుడమిం

జెన్నుగ నా రాస లీల సేరి చలిపితే

విన్నునఁ గాంచ సురలు శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

47.  

 

 

 

కం.

పన్నుగ నస్ఖలితమ నీ

వన్నెలఁతలతోఁ జలిపితి వారిక్రీడల్

మిన్నఁగఁ గరుల పగిది శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

48.  

 

 

 

కం.

చన్నే పరాంగనలు కల

రన్న నిట సకల చరాచ రాత్మల నిత్య

మ్మున్నట్టి నీ కకట శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

49.  

 

 

 

కం.

కన్నం బ్రాణుల కర్మ

చ్ఛిన్నం బొనరించు నీకుఁ జెయ్వులు గర్మ

చ్ఛన్నము లెట్లౌ నయ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

50.  

 

 

 

కం.

అన్నందుఁ బట్ట సర్పము

దన్నఁగ గత శాపుఁ డయి సుదర్శనుఁ డయ్యెం

గన్నా నీ మహిమన్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

51.   

 

 

 

కం.

ఎన్ని వ్రజాంగనలం గొని

చన్న బలిమి శంఖచూడుఁ జంపితి యక్షుం

బన్నుగఁ గొంటివి మణి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

52.  

 

 

 

కం.

నిన్నలయింప నరిష్టునిఁ

బెన్నెద్దును శృంగ యుగము పీఁకి వధింపన్

మిన్నున సుర లలరిరి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

53.  

 

 

 

కం.

తన్నఁ దురగాసురుఁడు కే

లున్నింపి కడుపునఁ గేశు లుప్తాసువుగాఁ

గ్రన్నం జేసితివే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

54.  

 

 

 

కం.

పిన్నల దొంగిలి గుహలోఁ

బన్నుగ నుంచఁ గని వ్యోముఁ బల లాశనునిన్

మన్నుకఱపించితివి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

55.  

 

 

 

కం.

చెన్నుగ నక్రూరునకున్

మున్ను నదినిఁ బిమ్మట రథమునఁ గన్పడిరే

యన్నయు నీ వొక తఱి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

56.  

 

 

 

కం.

పెన్నాదిశేషు ఫణిపైఁ

గన్నదరఁగఁ గాంచె నిన్ను గమనీయముగా

నన్నర శేఖరుఁడే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

57.  

 

 

 

కం.

 

చెన్నుగఁ జేరిరి కాంచం

గ్రన్నన మన్నించి నెమ్మిఁ గంసాఙ్ఞన్ మీ

రన్నగరము మధురన్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

58.  

 

 

 

కం.

చెన్నగుఁ బుట్టము లిమ్మన

నన్నరపుం జుట్టము లన నా రజకుఁడు తి

ట్టన్నీ వుక్కడిచితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

59.  

 

 

 

కం.

నిన్ను గని యొక్క నేఁతరి

మిన్న పరిచ్ఛదము లీయ మెచ్చి యతనికిం

బన్నుగ సిరు లిచ్చితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

60.  

 

 

 

కం.

హృన్నంద సురభి మాలల

నిన్నంద కుమారుల కిడ నెలమి సుదామున్

మన్నించిరి శ్రీలన్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

61.   

 

 

 

కం.

అన్నువ కుబ్జకు వక్రతఁ

బన్నుగఁ దీర్చి తనులేప వర దానమునం

గన్నియ నలరించితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

62.  

 

 

 

కం.

పన్నుగ వింటింటికిఁ జని

నిన్నడ్డిన రాచ విల్లు నెమ్మిన్ సంధిం

చ న్నడిమికి విఱిగెన్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

63.  

 

 

 

కం.

నిన్నుం ద్రొక్కఁగ బల సం

పన్నేభము వడిఁ గదియఁ గువలయాపీడం

బన్నాగముఁ జంపితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

64.  

 

 

 

కం.

నిన్నెదిరింపఁ గదియ నా

పన్నత దంతావళ పరిపాలక వర్గ

మ్మున్నగ ధర చంపితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

65.  

 

 

 

కం.

మిన్నయ మల్లుర నెల్లరఁ

గన్నా చాణూర ముష్టికద్వయమే చ

చ్చెన్నగ ధర మీ చే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

66.  

 

 

 

కం.

కన్నా కం సేభమ్మును

బన్నుగఁ గృష్ణ వర నామ పారీంద్రమ్మ

న్నన్న యెగసి చంపెను శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

67.  

 

 

 

కం.

పన్నుగఁ గాంచెను ముక్తినిఁ

గన్నా ఘన వైరమున నకట మామ మదిన్

నిన్నుంచ నిత్యమున్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

68.  

 

 

 

కం.

పెన్నలుకఁ గదియ రోయుచు

నన్నకు న్యగ్రోధ కహ్వు లంత నరసి రా

మన్న వధించెఁ జెలఁగి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

69.  

 

 

 

కం.

క్రన్నన విడిపించి చెఱను

బన్నుగ మాతా పితలకుఁ బ్రభువుగ నీ తా

తన్నిల్పితి వయ్యా శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

70.  

 

 

 

కం.

విన్నాణ మున్న నేర్చిరి

సన్నుత విశ్వ గురు లైన సాందీపని వ

ద్ద న్నయముగ విద్యను శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

71.   

 

 

 

కం.

మన్నిగొని పంచజనుఁ జని

తిన్నఁగ నర్క సుతు నడిగి తెచ్చి గురు సుతుం

గ్రన్నన గురున కిడితె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

72.  

 

 

 

కం.

ఎన్ని యపాయము కడలినిఁ

బన్నుగ నిర్మింపఁ జేసి ద్వారక జనముం

దన్నగరిఁ జేర్చితే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

73.  

 

 

 

కం.

నిన్నే వెన్నంటఁ బఱచి

యన్నృపు ముచుకుందుని నయనాగ్ని కొసఁగితే

పన్నుగఁ గాలయవను శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

74.  

 

 

 

కం.

శ్రీన్నలినాక్షిన్ రుక్మిణి

నన్నయె కాదన్నను మగధాధీశుఁడు న

డ్డున్నం బెండ్లాడితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

75.  

 

 

 

కం.

పన్ని గెలిచి యని మణికై

కన్నియ భల్లూక బాలికన్ జాంబవతిం

గన్నా పెండ్లాడితె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

76.  

 

 

 

కం.

మన్నించు మనఁగ సత్రా

జిన్నృపుఁడే సత్యభామఁ జిన్మయ రూపం

గన్నాపెండ్లాడితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

77.  

 

 

 

కం.

అన్నుల మిన్నలు భామల

వెన్నుఁడ కాళింది మిత్రవిందల నెలమిం

గన్నా పెండ్లాడితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

78.  

 

 

 

కం.

మిన్నంటు మోదమున యా

గాన్నా నాగ్నజితి భద్ర యను రూపరులం

బన్నుగ పెండ్లాడితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

79.  

 

 

 

కం.

తిన్నంగఁ గొట్టి, లక్షణ

నన్నెల ముఖి, మత్స్యయంత్ర మవలీల హరీ

బన్నుగ పెండ్లాడితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

80.  

 

 

 

కం.

మన్నుకఱపించి నరకునిఁ

దన్నిలయ స్థిత వశలఁ బదాఱువెయుల నా

సన్నలఁ బెండ్లాడితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

81.   

 

 

 

కం.

నిన్ననుకరించి వేషము

న న్నిందను వాసుదేవ నాముఁడు సేయన్

మన్నిగొనితి పౌండ్రకు శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

82.  

 

 

 

కం.

 

అన్నారదుం డొకే తఱిఁ

బన్నుగ  షోడస సహస్ర భార్యల యిండ్లన్

నిన్నే కాంచె నహో శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

83.  

 

 

 

కం.

మన్నించి నూఱు తప్పుల

నెన్ని మనమ్మున వధించితే చక్రమునం

గన్నా శిశుపాలుని శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

84.  

 

 

 

కం.

నిన్నే స్మరింప నా చై

ద్యన్న భవత్రయ మసూయ నైక్యంబయ్యెం

గన్నా నీ లోనన్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

85.  

 

 

 

కం.

కన్నుల నిప్పులు కురియుచు

నిన్నుఱుమఁగ దంతముఖుఁడు నివ్వటిలంగం

గ్రన్నన వధించితే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

86.  

 

 

 

కం.

నిన్నే తలంప నాతఁడు

నన్ని తఱులఁ ద్వేష మూని యత్తను తేజం

బన్న కరఁగె నీ లో శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

87.  

 

 

 

కం.

మున్ను శిశుపాలుఁ డా జయుఁ

డెన్నంగా దంతవక్త్రుఁ డీ విజయుండే

కన్నా నీ బంటులు శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

88.  

 

 

 

కం.

చిన్నప్పటి నీ మిత్రున

కెన్నెన్ని సిరుల నొసంగి తీ వా యటుకుల్

తిన్నం గుచేలునకు శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

89.  

 

 

 

కం.

మున్నా మరీచి వర్షల

కన్న కుమారులు షడర్భక మృత తనయులే

యన్నల మాత కిడితె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

90.  

 

 

 

కం.

మిన్నఁగ నెవ్వనిపై దయ

యున్న న్వాని దగు విత్త మొయ్యన నూడ్పం

గన్నా నీ లీలయె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

91.   

 

 

 

కం.

మిన్నఁగ జరిపించుచు వే

జన్నములు యశస్కరములు సరి మంటి వయా

యన్నుల మిన్నలతో శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

92.  

 

 

 

కం.

చెన్నుగ నొక్కొక్కరికిన్

సన్నందనులఁ బదిమంది సద్భార్యలకుం

గన్నా యొసంగితే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

93.  

 

 

 

కం.

మున్ను సురాసుర రణమునఁ

జన్న యసుర వీరు లైరి సకలాధీశుల్

మిన్నగ ద్వాపరమున శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

94.  

 

 

 

కం.

పన్న నమరాలయము నం

దున్న యనిమి షేంద్రు లైరి యుత్తమ చిత్తుల్

చెన్నుగ యాదవులే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

95.  

 

 

 

కం.

పన్నుగ నొసంగి కృష్ణకుఁ

గన్నా కృప వస్త్ర రాశి కాపాడితి వీ

వన్నారికి మానము శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

96.  

 

 

 

కం.

చెన్నుగ ఖాండవ మగ్నికిఁ

గన్నా నరు నీయఁ జేయ గాండీ వాదుల్

క్రన్నన నిప్పించితి శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

97.  

 

 

 

కం.

అన్నరున కొసఁగి జ్ఞానము

సన్నద్ధునిఁ జేసి యాజి క్ష్మా  భారమ్ముం

గన్నా తగ్గించితె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

98.  

 

 

 

కం.

చెన్నుగ జనింతు వీవే

యిన్నేలన్ శిష్ట రక్ష ణేతర శిక్షా

సన్నుత ఘన దక్షా! శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

99.  

 

 

 

కం.

విన్నారము నీ కథలం

గన్నారము నీ మహిమము కమనీయముగా

నున్నారము సుఖమున శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

100.                             

 

 

 

కం.

కన్నా నీ పాదాబ్జము

లెన్నఁగ సనకాది మౌని హృదయ స్థితముల్

సన్నుత భాసితముల్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

101.                              

 

 

 

కం.

కన్నా నీ పాదాబ్జము

లెన్నఁగ లక్ష్మీ మనస్సమీప్సిత సుమముల్

సన్నత సురౌఘముల్ శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

102.                             

 

 

 

కం.

మిన్నఁగ ధరణీ భారము

విన్నంటఁగఁ బంకజాక్ష వే తగ్గింపం

గన్నా జనించితే శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

103.                             

 

 

 

కం.

పున్నాగ వరాఖ్యా! విల

సన్నాగద్విష విహార! సరసిజ నాభా!

సన్నత దైత్యగణా! శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

104.                             

 

 

 

కం.

కిన్నర గంధ ర్వామర

పన్నగ విద్యాధర నర వర ముని గణ స

త్సన్నుత! పరమాత్మా! శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

105.                             

 

 

 

కం.

ఉన్నత వామ కరాంగుళ

ధృన్నగ లీలా వినోద! కృష్ణ! యశస్సం

పన్నా! నలినాక్షా! శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

106.                             

 

 

 

కం.

పన్నగ వర తల్ప విరా

జన్నారాయణ! వటదళ శయనా! ఫణ రా

జన్నంద కిశోరా! శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

107.                             

 

 

 

కం.

ఎన్నఁగ వచ్చును దారల

నెన్నఁగ నగు భూ కణములు నింద్రాదుల కె

న్నన్నీ గుణము లగునె శ్రీ

మన్నారాయణ! విమల రమా హృన్నిలయా!

108.                             

 

 

ఇది విబుధజన విధేయ కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్య సుందరీ పేర్రాజ దంపతీ సుత

వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

శ్రీమన్నారాయణ శతకము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమన్నారాయణ శతకము

(శ్రీకృష్ణావతార సంగ్రహము)

 

గ్రంథ కర్తృ దంపతులు

 

వివరములు:

పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design)

స్వగ్రామము:

బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ఉద్యోగము:

1.     Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), Hyderabad.

2.    Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad.

3.    Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of  Engineering and Technology,  Raipur.

నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013  

Cell. Nos. 8602787525, 9440378434.

 

స్వీయ రచనలు:

1.      రామ చంద్ర శతకము.

2.      పోచిరాజ శతకము.

3.      పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు).

4.      వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము).

5.      శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు).

6.      శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము).

7.      శ్రీమన్నారాయణ శతకము.

8.      శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు).

9.      శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక.

10.   మాహేశ్వర దండకము.

11.   మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక.

12.   ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుఁడు

13.   శ్రీమదాంధ్ర రామాయణము.  

14.   శ్రీ బాల రామాయణము (సంక్షిప్త రామాయణము)  (కొనసాగుచున్నది)

15.   గోవిందము.